: ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలే లక్ష్యంగా మోదీ అమెరికా పర్యటన.... డీల్ విలువ 2 బిలియన్ డాలర్లు!


ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనకు 26న బయల్దేరి వెళ్లనున్నారు. ఆ రెండు రోజులు వాషింగ్టన్ లో గడపనున్న ఆయన తొలిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీ తొలిసారి అమెరికా వెళ్తుండడంతో ఈ సారి భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో 22 ప్రిడేటర్‌ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు మోదీ ప్రయత్నించారు. ఈ మేరకు చర్చలు జరిగాయి. అయితే ట్రంప్ అధ్యక్షుడు కావడంతో ఆ ఒప్పందం ఫలప్రదం కాలేదు.

దీంతో ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలే లక్ష్యంగా మోదీ అమెరికా పర్యటన జరగనుంది. ఈ డీల్ విలువ 2 బిలియన్ డాలర్లకు పైమాటేనని తెలుస్తోంది. దీంతో పాటు ఉగ్రవాదం, ఆర్థిక సహకారం వంటి విషయాలపై ట్రంప్ తో ఆయన చర్చించనున్నారు. 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరం కలిగిన భారతదేశం...తీర ప్రాంతంపై నిఘా పెట్టేందుకు ప్రిడేటర్ డ్రోన్ల సహాయం తీసుకోనుంది.

భారత ప్రాదేశిక జలాల్లోకి శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పేరు చెప్పి పదేపదే చైనా జలాంతర్గాములు చొచ్చుకువస్తుండడంతో ప్రిడేటర్ల కొనుగోలు ఆవశ్యకత ఎంతైనా వుందని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటి కొనుగోలుకు ముందడుగు వేస్తోంది. ఈ ఒప్పందం పూర్తయితే ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేసిన నాటో కూటమిలో లేని దేశంగా భారత్ నిలుస్తుంది.

  • Loading...

More Telugu News