: అనిల్ కుంబ్లేతో వివాదం: తొలిసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెలరేగిన వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లేతో తనకు ఏర్పడిన వివాదంపై తొలిసారి కోహ్లీ స్పందించాడు. రేపటి నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని అనిల్ భాయ్ నిర్ణయించారని చెప్పాడు. ఆయన నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని, ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారని వ్యాఖ్యానించాడు.
కుంబ్లే రాజీనామా చేయడానికి కారణం ఏమిటని అడిగిన ప్రశ్నకు మాత్రం కోహ్లీ సూటిగా సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో ఎన్నో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయని అన్నాడు. అసలు డ్రెసింగ్ రూమ్‌కు ఏమాత్రం సంబంధం లేనివాళ్లు ఈ ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. అందులో ఏం జరిగిందన్న విషయం పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని వ్యాఖ్యానించాడు. అందులో జరిగిన దాని గురించి బయటకు చెప్పలేనని అన్నాడు. తాను ఎల్లప్పుడూ డ్రెసింగ్ రూమ్‌లో అనుచితంగా వ్యాఖ్యలు చేయబోనని అన్నాడు.