: జైల్లో చిప్పకూడు తిని బెయిల్ పై ఉన్నావు.. నీ బతుకేందో నీకే తెలియదు..: విజయసాయిరెడ్డిపై బండారు తీవ్ర వ్యాఖ్యలు


వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా తాము నైతిక విలువలతోనే బతుకుతున్నామని చెప్పారు. భూదాన్ ఉద్యమంలో 10 ఎకరాల భూమిని దానం చేసిన చరిత్ర తమది అని... 16 నెలలు జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరస్తుడైన విజయసాయిరెడ్డి తనపై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమని అన్నారు. తాను భూకబ్జాలు చేశానన్న విమర్శలకు విజయసాయిరెడ్డి ఆధారాలు చూపించాలని... అడ్డగోలుగా విమర్శలు చేస్తే, సహించేది లేదని హెచ్చరించారు.

 ఆధారాలు పట్టుకొచ్చి మీడియా ముందు నిరూపిస్తే ఉరి వేసుకుంటానని ఇప్పటికే చెప్పానని, అయినా మళ్లీ అదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను కాని, తన కుటుంబసభ్యులు కాని, తన బంధువులు కాని భూములు కబ్జా చేసినట్టు నిరూపిస్తే... వైసీపీ ఆఫీసులో బండ్రోతుగా పని చేస్తానని సవాల్ విసిరారు. 'జైల్లో ఉండి చిప్ప కూడు తిని, బెయిల్లో ఉన్నావు... మళ్లీ ఎప్పుడు జైలుకు వెళతావో... నీ బతుకేందో నీకే తెలియదు... నువ్వా నాపై ఆరోపణలు చేసేది?' అని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News