: ఇక్కడికి సెల్‌ఫోన్ తయారీ కేంద్రం వస్తుందంటే ముందు ఎవ్వరూ నమ్మలేదు: చంద్రబాబు
తిరుపతికి సెల్‌ఫోన్ తయారీ కేంద్రం వస్తుందంటే ముందు ఎవ్వరూ నమ్మలేదని, ఇప్పుడు దాన్ని చేతల్లో చూపించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబు నాయుడు రేణిగుంటలో సెల్‌ఫోన్‌ల తయారీ సంస్థ సెల్‌కాన్ యూనిట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చైనాలో కొన్ని సిటీల్లో హార్డ్‌వేర్, సెల్‌ఫోన్‌ల కంపెనీలే ఉపాధి అవకాశాలుగా ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా గురించి చెప్పగానే తాము ఆ రోజే ఆ ఆలోచనను కొనియాడామని అన్నారు.
భవిష్యత్తులో హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ తయారీల పరిశ్రమకు తిరుపతి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ఎవ్వరు అడ్డుపడ్డా అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పారు. తాము పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా మారుతుందని చెప్పారు. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా తీర్చిదిద్దుతామని అన్నారు.