: కొత్త బైక్‌పై గీతలు పడ్డాయని... తన సోదరుడి రెండు చేతులను నరికేసిన యువకుడు
చిన్న విషయానికే ఓ యువకుడు తన సోదరుడి చేతులను నరికివేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని షామ్లి జిల్లాకు చెందిన అహ్మద్ అనే యువకుడు కొత్తగా ఓ బైక్ కొనుక్కున్నాడు. అహ్మద్ సోదరుడి మూడేళ్ల కుమారుడు ఆ కొత్త బైక్‌పై ఆడుకుంటూ కూర్చున్నాడు. ఈ క్రమంలో ఆ బైక్‌పై గీతలు పడ్డాయి. అది చూసిన అహ్మద్ తన కొత్త బైక్‌పై గీతలు గీస్తావా? అంటూ కోపోద్రిక్తుడై ఆ చిన్నారిని కొట్టబోయాడు.
దీంతో అతని సోదరుడు మహమ్మద్ తన కుమారుడిని కొట్టద్దంటూ అడ్డుపడ్డాడు. దీంతో ఓ కొడవలి తీసుకున్న అహ్మద్ తన అన్న రెండు చేతులనూ నరికేశాడు. ఇంట్లో వారు మహమ్మద్‌ని ఆసుపత్రికి తరలించారు. అయితే, మహమ్మద్ కుడి చేయి పూర్తిగా తెగిపోయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.