: '800 ఏళ్లనాటి మసీదును మేము పేల్చలేదు, అది అమెరికా పనే' అన్న ఐసిస్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా!
ఇరాక్ లోని మోసూల్ నగరంలో అత్యంత పురాతనమైన, ఎంతో ప్రాచుర్యం కలిగిన 800 ఏళ్లనాటి అల్ నూరీ మసీదును ఐసిస్ ఉగ్రవాదులు బుధవారం పేల్చేశారు. అయితే, మసీదును తాము పేల్చలేదని ఐసిస్ ప్రకటించింది. అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడుల్లోనే మసీదు ధ్వంసమైందని తెలిపింది. ఐసిస్ వివరణను అమఖ్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది. అయితే, ఐసిన్ చేసిన ఆరోపణలపై అమెరికా మండిపడింది. మసీదును తాము ధ్వంసం చేయలేదని అమెరికా స్పష్టం చేసింది. అసలు ఆ ప్రాంతంలో తాము బుధవారంనాడు దాడులే జరపలేదని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి కల్నల్ ర్యాన్ దిల్లాన్ తెలిపారు. ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాది మూడేళ్ల క్రితం ఈ మసీదులోనే తనను తాను కలీఫాగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.