: కర్ణన్‌కు గుండెనొప్పి.. జైలుకు తరలిస్తుండగా నొప్పి వచ్చిందన్న మాజీ న్యాయమూర్తి.. ఆస్పత్రికి తరలింపు
అరెస్టయిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్‌కు గుండెనొప్పి వచ్చింది. చెన్నైలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ (జైలు)కు తరలిస్తుండగా తనకు గుండెలో నొప్పిగా ఉందని కర్ణన్ పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 62 ఏళ్ల కర్ణన్ హైబీపీతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సలహాపై ఆయనను ఆస్పత్రిలో చేర్చాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని జైలు అధికారులు తెలిపారు.
కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు మే 9నే ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు వెలువడిన తర్వాతి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం కోల్‌కతా పోలీసులు చెన్నై సహా వివిధ ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఆయనను కోయంబత్తూరులో అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు అర్ధ రాత్రి దాటాక ప్రైవేటు విమానంలో కోయంబత్తూరు నుంచి చెన్నైకి తీసుకొచ్చారు. బుధవారం భారీ భద్రత నడుమ కర్ణన్‌ను కోల్‌కతా తరలించారు.