: రవిశాస్త్రి కోసం కోహ్లీ పట్టు.. పావులు కదుపుతున్న బీసీసీఐ.. మరోమారు దరఖాస్తుల ఆహ్వానం
టీమిండియా కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకోవడంతో ఆ స్థానంలో టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిని నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోహ్లీ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అనిల్ కుంబ్లే పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుట్, దొడ్డ గణేశ్ నుంచి దరఖాస్తులు అందాయి. అయితే వీరెవరికీ ఆ చాన్స్ లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా మరోమారు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బుధవారం ప్రకటన చేసింది. ఇది కేవలం రవిశాస్త్రి కోసమేనని చెబుతున్నారు.
సెహ్వాగ్‌కు కోచింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదని, జట్టును గైడ్ చేసేందుకు ఆయన సరైన వ్యక్తి కాదని, కాబట్టి ఏం జరుగుతుందో చూడాలని బీసీసీఐకి చెందిన ఒకరు వ్యాఖ్యానించారు. కాగా తాజాగా ఆహ్వానించిన దరఖాస్తులకు ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చారు. అంటే భారత జట్టు శ్రీలంక పర్యటనకు ముందే కొత్త ‘గురువు’ను ఎంపిక చేయనున్నారన్నమాట. బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సీకే ఖన్నా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.