: నేను చనిపోతా.. అనుమతించండి..: రాజీవ్ హత్యకేసు దోషి ‘మెర్సీ కిల్లింగ్' పిటిషన్


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న ఎల్‌టీటీఈ సభ్యుడు రాబర్ట్ పేయాస్ (52) మెర్సీ కిల్లింగ్ పిటిషన్‌ దరఖాస్తు చేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి చేసుకున్న దరఖాస్తులో తాను చనిపోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాడు. తాను బతికి ఉండడం వల్ల ప్రయోజనం లేదని అర్థమైందని, మరో 26 ఏళ్ల తర్వాత కూడా తాను జైలు నుంచి విడుదలవుతానన్న నమ్మకం లేదని, కాబట్టి చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని అందులో కోరాడు.

జూన్ 11 నాటికే తాను 26 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్నట్టు చెప్పాడు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జైలులో ఉన్న ఏడుగురు దోషులను విడిచిపెట్టాలని 2014లో నిర్ణయించారని గుర్తు చేశాడు. ఆమె నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని, అయితే ఏవో తెలియని కారణాలు తమను అడ్డుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్రంలోని గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ తమను విడుదల చేసేందుకు సిద్ధంగా లేవని పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులెవరు తనను చూడడానికి రాలేదని, కాబట్టి తాను బతికి ఉండడం వ్యర్థమని, తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని పేయాస్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News