: ఢిల్లీలో దారుణం: అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
అనుమానం పెనుభూతంగా మారి ఓ భర్త తన భార్యను దారుణంగా పొడిచి చంపిన ఘటన న్యూఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌లో చోటు చేసుకుంది. ఆమెపై దాడి చేస్తోన్న సమయంలో అడ్డు వచ్చిన 15 ఏళ్ల కుమారుడిపై కూడా ఆ వ్యక్తి దాడిచేశాడు. ఈ ఘటనలో ఆ బాలుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.
నిందితుడు బినోద్ బిష్త్ ఓ క్యాటరింగ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడని చెప్పారు. తన భార్య రేఖపై అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడే బినోద్.. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఈ రోజు తెల్లవారుజామున మరోసారి గొడవపడ్డాడని పోలీసులు అన్నారు. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన బినోద్ భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడని తెలిపారు. బాధితురాలి శరీరంపై 35 కత్తిపోట్లు కనిపించాయని పేర్కొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులని వివరించారు.