: ఐదు లక్షలు ఇస్తామనడంతో ఆ సినిమాలో నటించాను: రకుల్ ప్రీత్ సింగ్
కెరీర్ ఆరంభంలో మోడల్‌గా పనిచేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే. మొదట ఓ కన్నడ సినిమాలో నటించిన ఆమెకు డిగ్రీ చదువుతున్న సమయంలో ఆ ఆఫర్ వచ్చిందట. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కన్నడ సినిమా గిల్లీలో నటించాలని తనకు 2009లో ఆఫర్ వచ్చిందని చెప్పింది. అయితే, చదువుకుంటున్న సమయంలో సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని, అయినప్పటికీ ఆ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపింది.
అప్పట్లో నెలకు నాకు రెండు వేలు పాకెట్ మనీ ఉండేదని, ఆ సినిమా చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారని, దీంతో ఒక్కసారిగా పెద్ద మొత్తం వస్తోంది కదా అని చెప్పి ఆ సినిమాలో నటించానని రకుల్ పేర్కొంది. అనంతరం కూడా ఎంతో మంది కన్నడ నిర్మాతలు తన వద్దకు వచ్చి సినిమాల్లో నటించమని అడిగారని, అయితే, చదువుపైనే దృష్టిపెట్టాలనే ఉద్దేశంతో ఆ సినిమాలకు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. తన చదువు ముగిశాక మళ్లీ సినిమాల్లోకి వచ్చానని తెలిపింది.