: చిన్న కొడుకు ఆత్మహత్యతో మనస్తాపం.. పెద్ద కొడుకుతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డ తల్లి
తన చిన్న కుమారుడి ఆత్మహత్యను జీర్ణించుకోలేని ఓ తల్లి తన పెద్దకుమారుడితో పాటు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఆ రాష్ట్రంలోని దేవనహళ్లి తాలూకాలోని యలియూరుకు చెందిన సుజాత (35) ఇంట్లో చిన్న గొడవ చెలరేగింది. దీంతో ఆమె చిన్న కుమారుడు చంద్రతేజ్ (12) విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్న కుమారుడి మరణంతో కలత చెందిన సుజాత... పెద్ద కుమారుడిని తీసుకొని రైల్వే పట్టాల వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. తన చిన్న కుమారుడి మృతితో మనస్తాపం చెందానని, తమ చావుకు ఎవరూ కారణం కాదని ఆత్మహత్య లేఖ రాసింది.
తనను, తన పెద్దకుమారుడినీ ఒకే గోతిలో ఖననం చేయాలని ఆత్మహత్య లేఖలో కోరింది. తమను ఖననం చేస్తోన్న గోతిలో విల్సన్ బాల్, పౌడర్ డబ్బా, చెప్పులు కూడా వేయాలని కోరింది. తాను స్థానికంగా ఉండే సరస్వతమ్మ, ఆనంద్ అనే ఇద్దరికి కొంత అప్పు ఉన్నానని, వారికి ఇవ్వాల్సిన ఆ డబ్బుని ఇంట్లోని టీవీ కింద పెట్టానని అందులో రాసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.