: భూకబ్జాల్లో మంత్రి గంటా అల్లుడు ప్రశాంత్ పాత్ర ఉంది: వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి
విశాఖ భూ కబ్జాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు అల్లుడు ప్రశాంత్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రికి తెలియకుండా కబ్జాలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. పదవి, డబ్బు, ఇస్తామని వైఎస్సార్సీ పీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని, విశాఖలో ఇటీవల జరిగింది పార్టనర్ షిప్ సమ్మిట్ కాదని, సెటిల్ మెంట్ కబ్జా సమ్మిట్ లని ఆయన ఆరోపించారు.
విశాఖపట్టణంలో లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందని, భూ కబ్జాలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, చంద్రబాబు విశాఖను అభివృద్ది చేసింది శూన్యమని విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖ భూ కబ్జా వ్యవహారంపై తూతూ మంత్రపు విచారణ కోసమే సిట్ ను వేశారని, ఈ కుంభకోణంలో నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయంగా కలెక్టరే లక్ష ఎకరాలు ట్యాంపర్ అయ్యాయని చెప్పారని, ఈ కుంభకోణంలో ప్రభుత్వంపైనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు.