: బాలీవుడ్ హీరో బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ!
బాలీవుడ్ హీరో అర్షాద్ వార్సీకి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. అర్షాద్ తన బంగ్లాలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడని... ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదని బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అర్షాద్ బంగ్లాలోని అక్రమ నిర్మాణాలను తొలగించారు. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఈ కేసు బీఎంసీ దృష్టిలో ఉంది. అయితే, కూల్చివేతలు చేపట్టకుండా అర్షాద్ ఎప్పటికప్పుడు కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నాడు.
తాజాగా స్టే ఆర్డర్ ను కోర్టు ఎత్తివేయడంతో, బంగ్లాను పాక్షికంగా కూల్చి వేశారు. 2012లో ఎయిర్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీలో ఓ ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగి నుంచి అర్షాద్ ఈ బంగ్లాను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బంగ్లాలో అర్షాద్ అక్రమ నిర్మాణాలు చేపట్టాడంటూ సొసైటీ సభ్యులు బీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ 2013లో బీఎంసీ భావించింది. దీంతో, కోర్టు నుంచి అప్పట్లో స్టే తెచ్చుకున్నాడు అర్షాద్.