: ఢిల్లీపై లండన్ తరహా దాడి... ఉప్పందిందన్న ఇంటెలిజెన్స్.. పటిష్ట రక్షణ చర్యలు!
దేశమంతటా యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, లండన్ తరహాలో దాడికి దిగాలని ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పందింది. ప్రధానంగా ఇంటర్నేషనల్ యోగా డే లక్ష్యంగా దాడి ఉండవచ్చని, ఢిల్లీపై దాడికి ఉగ్రవాదులు తెగబడతారని సమాచారం అందుకున్న నిఘా వర్గాలు పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు.
దీంతో ఢిల్లీలో పెద్దఎత్తున యోగా డే జరుగుతున్న కనౌట్ ప్రాంతంలో బస్సులను బారీ కేడ్ల రూపంలో అమర్చి రక్షణ గోడను నిర్మించారు. లండన్ లో ప్రార్థనలు చేస్తున్న వారిపైకి వ్యాన్ తో దూసుకెళ్లిన విధంగా, యోగా చేస్తున్న వారిపై వాహనంతో దూసుకు రావచ్చన్న అంచనాతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనా చోటు చేసుకోకుండా వాహనాలనే అడ్డుగా నిలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం యోగా వేడుకలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.