: మెత్తబడ్డ డొనాల్డ్ ట్రంప్... వీసాల జారీపై అనునయ వ్యాఖ్యలు


నిన్న మొన్నటి వరకూ 'అమెరికా ఫస్ట్' అంటూ, వీసాల జారీ నిబంధనలను మరింత కఠినం చేస్తూ, ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇచ్చి, కోర్టులతో చీవాట్లు తిన్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత మెత్తబడ్డారు. వైట్ హౌస్ లో అమెరికన్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశం జరుగగా, హాజరైన టెక్ దిగ్గజాలను ఉద్దేశించి మాట్లాడుతూ, నిపుణులైన టెక్కీలకు అమెరికా ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని అన్నారు. అమెరికాకు వచ్చే సాంకేతిక నిపుణులను 'స్పెషల్ పీపుల్'గా అభివర్ణించిన ఆయన, వినూత్న ఉత్పాదనల సృష్టికి తాము పెద్దపీట వేస్తామని తెలిపారు.

ఇమిగ్రేషన్ విధానంలో ఐటీ కంపెనీలకు ఉన్న అన్ని అనుమానాలనూ తీరుస్తామని తెలిపారు. అంతకుముందు ఐటీ కంపెనీలు వీసా, ఇమిగ్రేషన్ నిబంధనల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ట్రంప్ దృష్టికి తీసుకురాగా, ఆయన పాజిటివ్ గా స్పందించారు. తన అల్లుడు జారెడ్ కుషనర్, బిలియనీర్ ఇన్వెస్టర్ పీటర్ తీల్ లతో పాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, బిల్ గేట్స్ వంటి వారు తనకు నిపుణులైన విదేశీ ఉద్యోగుల అవసరాన్ని గురించి వివరించారని తెలిపారు.

కాగా, రోజంతా జరిగిన సమావేశంలో 18 కంపెనీల చీఫ్ లు పాల్గొనగా, వారిలో ముగ్గురు భారత-అమెరికన్ సీఈఓలు ఉండటం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రోజంతా ట్రంప్ పక్కనే కనిపించగా, మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్ లు సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News