: యోగి ఆదిత్యనాథ్ పై కేసు పెట్టిన అసోంకు చెందిన గిరిజన మహిళ!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై అసోంకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ ఒరాంగ్ కోర్టును ఆశ్రయించారు. 24 నవంబర్ 2007న ఆల్ ఆదివాసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ అస్సాం ఆందోళన సందర్భంగా కొందరు ఆమెను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. తనను వివస్త్రను చేసి వారు కొడుతున్న చిత్రాన్ని ఎలాంటి ఫిల్టర్ వేయకుండా జూన్ 13న ఆదిత్యనాథ్ తో పాటు అసోం లోక్ సభ సభ్యుడు రాం ప్రసాద్ సర్మాలు సోషల్ మీడియాలో పోస్టు చేసి, తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బిస్వనాథ్ లోని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
దీంతో ఆమె వాంగ్మూలం నమోదు చేసిన మేజిస్ట్రేట్ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఆదిత్యనాథ్ ఆ ఫోటోను పోస్టు చేస్తూ బీజేపీ తరఫున ఆందోళనలో పాల్గొన్నందుకు తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని పేర్కొన్నారని తెలిపారు. అయితే, అది వాస్తవం కాదని, తాను ఏ పార్టీ తరపున ఆందోళనలో పాల్గొనలేదని ఆమె చెప్పారు.