: అద్భుతం.. రామ్‌నాథ్ కోవింద్ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి అని ఆయన చాలా రోజుల ముందే చెప్పేశాడు!
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నా ఎన్డీఏ పక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక బీజేపీ తర్జనభర్జన పడుతుండగా ఆన్ లైన్లో నితిక్ష్ శ్రీవాస్తవ అనే వ్యక్తి నిర్వహించిన క్విజ్ లో మాత్రం రామ్‌నాథ్ కోవింద్ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి అవుతాడని చాలా రోజుల ముందే బహిర్గతమైంది. బీజేపీ ప్రకటనతో అది నిజమని తేలిపోవడంతో ఇప్పుడీ విషయం సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది.
జూన్ 15న శ్రీవాస్తవ ‘‘బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?’’ ప్రశ్నతో ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించారు. ఇందులో ఆప్షన్లుగా ఎవరి పేర్లు సూచించలేదు. అయితే లలిత్ మిశ్రా అనే వ్యక్తి ఆ పోల్‌కు సమాధానంగా ‘‘నా ఉద్దేశం ప్రకారం బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌కు ఆ అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు. అనూహ్యంగా సోమవారం బీజేపీ చీఫ్ అమిత్ షా బీజేపీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించారు.
అంతే.. మిశ్రా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. వందలాదిమంది ఆయనను అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కొందరు ట్విటరాటీలు మిశ్రాను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తుండగా, మరికొందరు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఆడితే మిశ్రా తప్పకుండా గెలుచుకుంటాడని పేర్కొన్నారు.