: కృష్ణారావును పదవి నుంచి తొలగించడం అనైతికం: కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించడం అనైతికమని, నీతి, నిజాయతీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనపై వేటు వేసి బ్రాహ్మణుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని కాంగ్రెస్ పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షుడు మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చంద్రబాబు చులకనగా చూస్తున్నారనడానికి నిదర్శనం కృష్ణారావుని పదవి నుంచి తొలగించడమేనని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని ఆయన కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు చంద్రబాబు రాజకీయ రంగు పూస్తున్నారనడానికి ఇది తాజా నిదర్శనమని మండిపడ్డారు.