: ‘శాతకర్ణి’ సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదు: ఐవైఆర్ కృష్ణారావు
బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆ సినిమాలో చరిత్రను వక్రీకరించారని విమర్శించారు. ఏ ప్రాతిపదికన పన్ను మినహాయింపు ఇస్తారని ప్రశ్నించారు. ఈ అంశాలపైనే తాను పోస్టులు చేస్తే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాడంటూ కొన్ని రోజుల క్రితం ఇంటూరి రవికిరణ్ ను అరెస్టు చేసినప్పుడు తాను బాధపడ్డానని చెప్పారు. రవికిరణ్‌ను అరెస్ట్ చేసిన తరువాత తాను కొన్ని పోస్టులను షేర్ చేశానని అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి శ్రీకాకుళం వరకు అన్నిటిపైనా పోస్టులు పెట్టానని అన్నారు.
నిజానికి ఇప్పుడు తన ఫేస్బుక్ పేజ్‌కి పబ్లిసిటీ వచ్చిందని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను ఇలా చేస్తున్నానని కొందరు అంటున్నారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద అర్థబలం గానీ, అంగబలం గానీ లేవని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదని అయన అన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్లో కో ఆర్డినేటర్లందరూ టీడీపీ వారేనని ఆరోపించారు. అలాగే టీటీడీ ఈవోగా తెలుగురాని వ్యక్తిని నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.