: అర్థంకాని గొర్రెలకు ఏం చెప్పాలి?: ప్రతిపక్ష నేతలపై సీఎం కేసీఆర్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్ధిపేట జిల్లా కొండపాకలో రాష్ట్ర గొర్రెల పంపిణి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఇక్కడి ప్రజలు ప్రత్యేక తెలంగాణను ఎందుకు కోరారో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారి తీరుతుందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా పుంజుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందుకోసమే తాము గొర్రెల పెంపకం వంటి పథకాన్ని చేపట్టామని అన్నారు. తెలంగాణకు గొల్ల, కురుమలే గొప్ప సంపద అని ఆయన అన్నారు. ఇది అర్థం కాని గొర్రెలకు ఏం చెప్పాలి? అని ప్రతిపక్షాలను విమర్శించారు. తాము చేస్తోన్న కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీల నేతలు హేళన చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు బలపడితేనే తెలంగాణ బలపడుతుందని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసి అడ్డుకోవాలని చూసినా బంగారు తెలంగాణ సాధించి తీరుతామని అన్నారు.
వచ్చే మూడేళ్లలో గొల్ల, కురుమలు రూ.25 వేల కోట్ల సంపదను సృష్టించబోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. దాదాపు కోటిన్నర గొర్రెల పెంపకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గొర్రెలకు ఏవయినా వ్యాధులు సోకితే 1962 కి ఫోన్ చేస్తే వైద్యులు వచ్చి చికిత్స చేసి పోతారని అన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని అన్నారు. హరీశ్ రావు నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులు అద్భుతంగా ముందుకు వెళుతున్నాయని కేసీఆర్ అన్నారు. రైతులు, వృత్తి పనివారు బాగుపడితేనే గ్రామీణాభివృద్ధి బాగుపడుతుందని అన్నారు. అందుకోసమే తాము కోటి ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.
దేశంలో రైతులు సంఘటితంగా లేరని అన్నారు. కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ప్రభుత్వమే పూనుకొని రైతాంగాన్ని సమన్వయపరుస్తోందని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు కరెంటు కోతలు లేవని అన్నారు. రైతులకు ఏదైనా బాధ ఉంటే తనతో చెప్పాలని అన్నారు. ప్రతిపక్ష నాయకులు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి 20 రోజుల్లో ఐదు కేసులు వేశారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే వారికి తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కవని ఇలా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.