: పాకిస్థానీ వ్యాఖ్యపై సహనాన్ని కోల్పోయిన షమీ... రంగంలోకి దిగిన ధోనీ!
భారత్ పై ఘన విజయం సాధించిన తరువాత, పాకిస్థాన్ అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఘోర పరాజయం తరువాత టీమిండియా ఆటగాళ్లు పాక్ క్రికెటర్లను అభినందించి, పెవీలియన్ కు వెళుతున్న వేళ, ఓ అభిమాని "బాప్ కౌన్ హై... బాప్ కౌన్ హై" అని పదేపదే అరిచాడు.
మిగతా ఆటగాళ్లు ఈ వ్యాఖ్యలను పట్టించుకోకపోయినా, భారత పేసర్ మహమ్మద్ షమీకి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. పైకి వెళుతున్న షమీ, సహనం కోల్పోయిన స్థితిలో కోపంగా కిందకు దిగుతూ, సదరు అభిమాని ముందుకు వచ్చాడు. ఆ సమయంలో వెనకాలే వస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ, షమీని సముదాయించి పైకి తీసుకువెళ్లాడు. ధోనీ రాకతో పరిస్థితి సద్దుమణిగినా, ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 338 పరుగులు చేయగా, భారత్ 158 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.