: చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టి.. పదవికి ఎసరు పెట్టుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు!
ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పదవిపై కత్తి వేలాడుతోంది. ఫేస్ బుక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో... ఆయనకు పదవీగండం వచ్చిపడింది. చంద్రబాబును విమర్శిస్తూ ఫేస్ బుక్ లో వస్తున్న పోస్టులను షేర్ చేసిన వివాదం ఆయన మెడకు చుట్టుకుంది.
23 ఏళ్ల క్రితం ఓ ప్రముఖ దినపత్రికలో దివంగత ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్ ను... చంద్రబాబు ప్రోత్సాహంతోనే వేశారంటూ పెట్టిన పోస్టును కృష్ణారావు షేర్ చేశారు. అంతేకాదు, ఇటీవల వైసీపీ తరపున సోషల్ మీడియాలో వస్తున్న పలు పోస్టులను కూడా కృష్ణారావు షేర్ చేశారు. 'కమలనాథులయందు కమ్మనాథులు వేరయా' అంటూ టీడీపీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టును కూడా తన అకౌంట్ ద్వారా ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారావుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు టీడీపీ అభిమానులు కూడా కృష్ణారావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులో ఉండి కూడా... ఇలాంటి పోస్టులను షేర్ చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారావు తన వైఖరితో ముఖ్యమంత్రి, ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రజలను అవమానించారని ఫేస్ బుక్ లో మండిపడుతున్నారు. ఉన్నత బాధ్యతలను నిర్వహిస్తున్న వ్యక్తి ఇలా చేయడం సరికాదని అంటున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న కృష్ణారావు బ్రాహ్మణులకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా ఇంతవరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని... చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులను మాత్రం షేర్ చేయడం దారుణమంటూ విమర్శిస్తున్నారు.