: బస్టాప్ లో నిలుచున్న యువతికి ముద్దులు పెట్టి పరారైన దుండగుడు!
ఇండియన్ ఐటీ హబ్ గా, గ్రీన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం... మహిళలకు రక్షణ లేని నగరంగా అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. ఇప్పటికే బెంగళూరులో మహిళలపై ఎన్నో దురాగతాలు జరిగాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, 24 ఏళ్ల ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలసి, ఓ స్నేహితుడి ఇంట్లో పార్టీ చేసుకుంది. పార్టీ ముగిసే సమయానికి అర్ధరాత్రి గడచిపోయింది. మద్యం తాగి ఉండటంతో సదరు యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ బైక్ పై వెళ్లడం సురక్షితం కాదని, ఓ క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో, క్యాబ్ కోసం జేబీనగర్ బస్టాప్ వద్ద వారు వేచి ఉన్నారు. ఇంతలోనే ఓ ఆగంతకుడు అక్కడకు వచ్చి, ఒక్కసారిగా ఆమెపై ముద్దుల వర్షం కురిపించాడు. ఆ సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లో మెసేజ్ లు చూసుకుంటున్నాడు. జరుగుతున్న దారుణం నుంచి వారు తేరుకునేలోపే... ముద్దులిచ్చిన ఆగంతుకుడు పరారయ్యాడు. ఈ ఘటనపై ఆమె బాయ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.