: హార్ధిక్ పాండ్యా వివాదాస్పద ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్!
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సిక్సర్లతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇండియా ఓటమి అప్పటికే ఖరారైన సమయంలో తన భారీ సిక్సర్లతో పాండ్యా హోరెత్తించాడు. పాండ్యా క్రీజులో ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదేమోనన్న భావన కూడా చాలా మందిలో ఉంది. అయితే, పాండ్యా దూకుడుగా ఆడుతున్న సమయంలో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. బంతిని ఆడిన జడేజా రన్ కోసం ముందుకు పరుగెత్తగా... పాండ్యా స్ట్రయికింగ్ ఎండ్ వైపు పరుగెత్తాడు. అయితే, మనసు మార్చుకున్న జడేజా మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు. దీంతో, పాండ్యా రనౌట్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో, పాండ్యా ఓ వివాదాస్పద ట్వీట్ చేశాడు. 'మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం... ప్రత్యర్థి జట్టుకు అంత సామర్థ్యం లేదు' అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే కాసేపటికే ఈ ట్వీట్ ను పాండ్యా డిలీట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్ ను ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయడంతో... ప్రస్తుతం ఇది విపరీతంగా రీట్వీట్ అవుతోంది.