: ఫైనల్ కు వెళ్లడమే మా ఘనత... పాక్ చేతిలో ఓటమికి సిగ్గుపడటం లేదన్న కోహ్లీ!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఇండియాపై ఉన్న అంచనాలు, ఒత్తిడిని లెక్కలోకి తీసుకుంటే, ఫైనల్ వరకూ వెళ్లడమే తమ ఘనతని కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. దేశం గర్వపడే ప్రదర్శనను కనబరిచామని, జట్టును ఫైనల్ చేర్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని చెప్పాడు. ఫైనల్ లో తమ ఆటతీరు అత్యుత్తమంగా లేదని అంగీకరించేందుకు తానేమీ సిగ్గుపడటం లేదని అన్నాడు. సమష్టి వైఫల్యమే ఇందుకు కారణమని అన్నాడు.
ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపిస్తూ, అతను ఆడుతుంటే, లక్ష్యానికి దగ్గరగా వెళ్లగలమన్న నమ్మకం కూడా కలిగిందని, ఒత్తిడి మధ్య పొరపాట్లు సహజమని, అటువంటి పొరపాటే హార్దిక్ ను రన్నౌట్ రూపంలో పెవీలియన్ కు పంపిందని చెప్పాడు. ఫైనల్ కు సిద్ధం చేసిన పిచ్, స్పిన్నర్లకు సహకరిస్తుందనే ఇద్దరిని తీసుకున్నామని, అయితే, బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ కావడంతో స్పిన్నర్లకు పెద్ద సవాల్ ఎదురైందని అన్నాడు. భవిష్యత్తులోనూ ఇదే జట్టు కొనసాగుతుందని, తప్పులను సవరించుకుని మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తామన్న నమ్మకం తమకుందని తెలిపాడు.