: చాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయినా.. వన్డే ర్యాంకుల్లో మూడో స్థానాన్ని పదిలపరుచుకున్న టీమిండియా!
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మాత్రం తన స్థానాన్ని పదిలపరుచుకుంది. సోమవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టిన దక్షిణాఫ్రికా 50 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 47 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లు మాత్రం చెరో పాయింట్‌ను కోల్పోయాయి.
ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2019లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో నేరుగా పాల్గొనాలంటే ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి టాప్-8లో నిలవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్కిప్పర్ కోహ్లీ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో అజేయంగా 123 పరుగులు చేసిన రోహిత్ శర్మ మూడు స్లాట్లు మెరుగుపరుచుకుని పదో స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్‌లో పేసర్ భువనేశ్వర్ కుమార్ 19వ స్థానంలో నిలిచాడు.