: ‘ఉపాధి హామీ’, ‘సామాజిక భద్రత’కు గాను ఏపీకి 19 అవార్డులు
ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రతా కార్యక్రమాల అమలు తీరుకు సంబంధించి పలు విభాగాల్లో ఏపీకి 19 అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ అవార్డుల్లో భాగంగా ఈ ఏడు కూడా ఈ అవార్డులను అందజేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డులను అందజేశారు. ఏపీ తరపున గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు, అడిషనల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఈ అవార్డులను అందుకోగా, ‘ఉపాధి హామీ’ అమలులో ఉత్తమ జిల్లాగా ఎంపికైన విజయనగరం తరపున ఆ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అవార్డు అందుకున్నారు.
అనంతరం, రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి 19 అవార్డులు రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఏపీని అన్నివిధాలా అభివృద్ధి చేయాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు తగినట్టుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందునే ఈ అవార్డులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు.