: కోహ్లీ! వ్యూహమేది?: సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నల వర్షం!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభిమానులు మండిపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో అద్భుతమైన అవకాశాన్ని చెత్తవ్యూహంతో నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫైనల్ కు ఏ వ్యూహంతో కోహ్లీ సిద్ధమయ్యాడని వారు ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ సలహా ఇస్తూ, టాస్ గెలిస్తే పొరపాటున కూడా ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించవద్దని,  భారత్ కు ఫీల్డింగ్ అప్పగించాలని నేరుగా సూచించిన సంగతి తెలిసిందేనని గుర్తు చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు దిగ్గజ మాజీ ఆటగాడు నేరుగా భారత్ బలం బ్యాటింగ్ అని, అందుకే తొలుత బ్యాటింగ్ చేయనీయవద్దని సూచిస్తే... కోహ్లీ ఏ లక్ష్యంతో పాక్ జట్టును బ్యాటింగుకి ఆహ్వానించాడని అడుగుతున్నారు.

ఫైనల్ లో ఫ్లాట్ పిచ్ పై టోర్నీలో ఇప్పటి వరకు రాణించని అశ్విన్ ను ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. బుమ్రా వరుసగా ఎక్స్ ట్రాలు ఇస్తున్నప్పుడు స్పెల్ ఎందుకు మార్చలేదని అడుగుతున్నారు. ఫీల్డింగ్ మోహరింపు కూడా సమర్థవంతంగా లేదని, బ్యాటింగ్ లో వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నట్టు కనిపించలేదని... ఏ దశలోనూ టీమిండియా ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ లో సానుకూలత కనిపించలేదని పేర్కొంటున్నారు. నవ్వుతూ బ్యాటింగ్ చేసే ధావన్ ముఖం వాడిపోయి ఉందని, కేవలం హార్డిక్ పాండ్య మాత్రమే సహజంగా ఎలాంటి బెరుకు లేకుండా సహజసిద్ధంగా ఆడాడని వారు పేర్కొంటున్నారు. ఈ వైఫల్యాన్ని జట్టు వైఫల్యం అనేకంటే కోహ్లీ వైఫల్యం అనడంలో ఎలాంటి సందేహం లేదని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News