: హైదరాబాదులో 46 కేజీల బంగారం దోచేసిన దొంగలు ముంబైలో పట్టుబడ్డారు!
హైదరాబాదులో భారీ దోపిడీకి పాల్పడిన దొంగలు చివరికి ముంబైలో దొరికారు. గత డిసెంబర్ 23న రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి వెళ్లి సీబీఐ అధికారులమంటూ దర్జాగా 8 కోట్ల రూపాయల విలువైన 46 కేజీల బంగారాన్ని దోచేసిన దోపిడీ ముఠాను పోలీసులు పట్టేశారు. ముంబైలో మురికి వాడగా పేరొందిన ధారవీ ప్రాంతంలో తలదాచుకున్న కీలక నిందితులు రాజరత్నం, రాధ దంపతులను పోలీసులు పట్టుకున్నారు.
దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు పట్టుబడ్డారు. ముత్తూట్ ఫైనాన్స్ లో దోచుకున్న 46 కేజీల బంగారాన్ని కడ్డీలుగా మార్చి విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు కేజీలకుపైగా ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుల నుంచి ఇప్పటివరకు కేవలం 6 కేజీల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.