: కోహ్లీ విజయ రహస్యమిదే.... కోహ్లీని కట్టడి చేస్తేనే పాక్ కు ఛాన్స్ ఉంటుంది!: డివిలీర్స్ సూచన


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కట్టడి చేయడంపైనే పాకిస్థాన్ విజయావకాశాలు ఉంటాయని సౌతాఫ్రికా కెప్టెన్, ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సహచరుడు ఏబీ డివిలీర్స్ పాక్ జట్టుకు సూచించాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మన్ లలో ఒకడైన కోహ్లీ మంచి ఫాంలో ఉన్నాడని గుర్తు చేశాడు. అలాగే టీమిండియా బ్యాటింగ్‌ లైనప్ అత్యంత బలమైనదని అన్నాడు. అయినప్పటికీ పాక్ బౌలర్లు కోహ్లీపై దృష్టి పెట్టాలని సూచించాడు. క్రీజులో దిగిన తరువాత కోహ్లి చేయితిరిగిన సిద్ధహస్తుడైన శస్త్ర చికిత్స నిపుణుడిలా ఉంటాడని తెలిపాడు. ఆట కోసం చాలా కష్టపడతాడని, ఎంత ఒత్తిడి ఉంటే అతడు అంత బాగా ఆడతాడని తెలిపాడు. బంతిని ఖాళీల్లోంచి కొట్టడంలో కోహ్లీ దిట్ట అని చెప్పాడు.

పరిస్థితులకు తగ్గట్టు ఆడడంతో నిపుణుడని అన్నాడు. నవ్వుతూనే బంతిని చితక్కొట్టేస్తాడని అన్నాడు. ప్రశాంతంగా ఉండి, నవ్వుతూ బౌలర్లను ఎదుర్కోవడమే కోహ్లీ విజయరహస్యమని డివిలీర్స్ చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యద్భుతమైన క్రికెటర్ అతడేనని తెలిపాడు. కోహ్లి ఫామ్‌ ఇలాగే కొనసాగితే ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా వరుస విజయాలను అడ్డుకోవడం కష్టమని చెప్పాడు. కెరీర్ ఆరంభంలో కోహ్లీ ఎప్పుడూ దూకుడుగా ఉండేవాడని...ఇప్పుడలా కాదని చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్టు, కెప్టెన్ గా పూర్తి అంకిత భావంతో ఆడుతున్నాడని డివిలీర్స్ తెలిపాడు. కోహ్లీ ఆట చూసేందుకు అభిమానుల్లాగే తాను కూడా ఇష్టపడతానని అన్నాడు. 

  • Loading...

More Telugu News