: రికార్డులకు ఎక్కనున్న భారత్-పాక్ ఫైనల్.. మ్యాచ్‌ను వీక్షించనున్న 32.4 కోట్ల మంది.. ఇంకా బోలెడన్ని విశేషాలు!


మరికొన్ని గంటల్లో హైటెన్షన్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను వీక్షించేందుకు పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఉద్యోగస్తులకు ఆదివారం కలిసి వచ్చింది. భారత్-పాక్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ రికార్డులకు ఎక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా 32.4 కోట్ల మంది దీనిని వీక్షించనున్నట్టు అంచనా. క్రికెట్ చరిత్రలో అతి ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్‌లలో ఇది మూడోది కాబోతోంది.

2011లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ను 55.8 కోట్ల మంది వీక్షించారు. అదే టోర్నీలో భారత్-పాక్ మధ్య జరిగిన సెమీస్ పోరును 49.5 కోట్ల మంది చూశారు. ఈ రెండే ఇప్పటి వరకు ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మూడోది కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు..

* పాకిస్థాన్‌తో జరిగిన గత ఐదు వన్డేల్లో నాలుగింటిని టీమిండియా గెలుచుకుంది. ఇంగ్లండ్‌ గడ్డపై పాక్‌తో జరిగిన పోరులో భారత్ మూడు సార్లు గెలుపొందగా పాక్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం 2-2తో సరిసమానంగా ఉన్నాయి.
* ఈ ఫైనల్‌ను భారత్ బ్యాటింగ్‌కు, పాక్ బౌలింగ్‌కు మధ్య జరిగే పోరుగా అభివర్ణిస్తున్నారు. ఐదేసి వికెట్లు తీసిన బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. హసన్ అలీ, జునైద్ ఖాన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు.
* భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధవన్ (317), రోహిత్ శర్మ (304), విరాట్ కోహ్లీ (253) పరుగులతో, బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్‌తో ఉండడం పాక్‌కు కలవరపరిచే అంశం.
* భారత్ ఇప్పటికే పలుమార్లు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో పాల్గొంది. పాకిస్థాన్‌తో మాత్రం ఇదే తొలిసారి. 60 శాతం మ్యాచ్‌లలో చేజింగ్ చేసి విజయాలు అందుకుంది.
* తాజాగా నేటి ఫైనల్ మాత్రం టీమిండియా కెప్టెన్ కోహ్లీకి పాక్ బౌలర్ జునైద్ ఖాన్‌కు మధ్య పోరు జరగనుంది. జునైద్ ఖాన్ వేసిన 22 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. మూడుసార్లు అతడి బౌలింగ్‌లో కోహ్లీ అవుటయ్యాడు.

  • Loading...

More Telugu News