: నేతలందరితో చర్చించే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు: నంద్యాల అభ్యర్థి ఎంపికపై కాల్వ శ్రీనివాసులు
భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానం కాబట్టి నంద్యాల నియోజకవర్గ సీటు కోసం టీడీపీ నుంచి అభ్యర్థిగా భూమా కుటుంబంలోని వారినే బరిలోకి దించుతున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు కర్నూలు జిల్లా టీడీపీ నేతలందరినీ పిలిచి, అభిప్రాయం తీసుకున్నాకే తమ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ టికెట్ భూమా కుటుంబానికే ఇవ్వాలని పార్టీలో మొదటి నుంచే ఉందని, ఒకవేళ ఆ కుటుంబంలోని వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే తమకే ఇవ్వాలని కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేశారని అన్నారు. చివరకు భూమా కుటుంబంలోని వారికే టికెట్ ఇవ్వాలని అందరూ కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.