: జగన్ ఆధ్వర్యంలో మహాధర్నాకు సిద్ధమవుతున్నాం: బొత్స సత్యనారాయణ
ఈ నెల 22న విశాఖపట్నంలో అఖిలపక్షంతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ ధర్నాలో రాష్ట్రంలో జరుగుతున్న భూ దందాలపై గళం విప్పుతామని తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ మహాధర్నా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడ భూములు కనిపించినా టీడీపీ నేతలు అక్రమంగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. భూ కబ్జాలపై తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. విశాఖపట్నంలో భూ దందాలు, కబ్జాలు చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, ప్రతిపక్షం ఆ అక్రమాలపై ప్రశ్నిస్తే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన పట్ల ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని చెప్పారు.