: వన్యప్రాణులను చంపి, వాటి విడిభాగాలతో వ్యాపారం చేస్తున్న పూజారి అరెస్ట్!
మధ్యప్రదేశ్‌లోని కర్గోన్ లో ఉన్న ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తోన్న లోకేశ్ జాగిర్దార్ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ పోలీసులకి చిక్కాడు. పూజారి వృత్తిలో ఉన్న ఆయన.. తనను నమ్మిన భక్తులకు టోపీ పెడుతున్నాడు. వన్యప్రాణులను చంపి, వాటి విడిభాగాలతో వ్యాపారం చేస్తున్నాడు. వన్యప్రాణుల శరీరాల నుంచి ఔషధాలు తీశానని, చేతబడి పద్ధతుల్లో అదృష్ట ఆభరణాలు తయారు చేశానని చెబుతూ, వాటిని లోకేశ్ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నాడు. వాటిని ధరిస్తే ఇక వద్దన్నా అదృష్టం మీ వెనకాలే పరుగులు తీస్తుందని నమ్మిస్తున్నాడు.
అవి ధరిస్తే తలరాత మారిపోతుందని, ఎక్కడికో వెళ్లిపోతారని ఆశ చూపిస్తున్నాడు ఈ పూజారి. ఆయన చేస్తోన్న మోసం కేవలం దేశంలోని ప్రజలకే పరిమితం కాదు.. తన ఉత్పత్తులను అమెరికా, మలేషియా, జర్మనీ, ఆస్ట్రేలియాలతో పాటూ మరిన్ని దేశాల్లో అమ్మేసేవాడు. చివరికి ఆయన మోసాన్ని కనిపెట్టిన ఢిల్లీ నుంచి వచ్చిన వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో (డబ్య్లూసీసీబీ), ఎస్టీఎఫ్, ఫారెస్ట్ అధికారులు ఆయనను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. ఆయన వద్ద నుంచి వన్యప్రాణుల శరీర భాగాలు, పలు ఔషధాలు, అదృష్ట ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.