: బీ కేర్ ఫుల్.. ముద్రగడ యాత్రలో పాల్గొనే వారిపై ఉక్కుపాదం మోపుతాం: ఏపీ హోం మంత్రి
కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన 'ఛలో అమరావతి' యాత్రకు అనుమతి లేదని ఏపీ హోంమంత్రి చినరాజప్ప మరోమారు స్పష్టం చేశారు. వచ్చే నెలలో నిర్వహించాలనుకుంటున్న ఈ యాత్రకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ముద్రగడ చేస్తున్నారని... కులాల పేరుతో కుంపటి రాజేసే వ్యక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ముద్రగడ మాటలు నమ్మి ఎవరైనా రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువత ఎవరూ ఆయనతో వెళ్లరాదని సూచించారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు.