: మరో వివాదానికి తెరలేపిన కేరళ మ్యాగజైన్.. కుంతీదేవి శీలాన్ని శంకిస్తూ పద్యం.. హిందూ సంస్థల ఆగ్రహం!
కేరళలోని ఓ కాలేజీ ప్రచురించిన స్టూడెంట్ మ్యాగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. పాండవుల తల్లి కుంతీదేవిపై ప్రచురించిన ఐదు లైన్ల పద్యం ‘చోద్యం’ హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచినట్టు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. మంజేరికి చెందిన ఎన్ఎస్ఎస్ కాలేజీ ప్రచురించిన ఈ మ్యాగజైన్‌లో ఓ విద్యార్థి ఈ పద్యాన్ని రాశాడు. ఇది కుంతీదేవి శీలాన్ని శంకించేలా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు ఈ పద్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను ఈ పద్యం తీవ్రంగా గాయపరిచిందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ ఆజాద్ మాలాట్టిల్ మాట్లాడుతూ తాము ఉద్దేశపూర్వకంగా ఆ పనిచేయలేదని పేర్కొన్నారు. మనోభావాలు గాయపడి ఉంటే తమను క్షమించాలని వేడుకున్నారు.
కాగా, 125 ఏళ్ల చరిత్ర కలిగిన తలసేరీలోని బ్రెనన్ కాలేజీ పబ్లిష్ చేసిన మ్యాగజైన్ కూడా రెండు రోజుల క్రితం వివాదాస్పదమైంది. ఓ థియేటర్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఓ జంట అసభ్యకర భంగిమలో ఉన్నట్టు ప్రచురించింది. మ్యాగజైన్‌ను ప్రచురించిన కాలేజీపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేసు పెడుతూ సత్వర చర్యలకు డిమాండ్ చేసింది. కాలేజీ తీరుపై దేశ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలు చల్లారకముందే తాజా మ్యాగజైన్ కలకలం రేపుతోంది. ఈ రెండు మ్యాగజైన్‌లు కేరళ కాలేజీలవే కావడం గమనార్హం.