: ఏదో ఒకరోజు నాకీ అవకాశం వస్తుందని తెలుసు...అందుకే శ్రమపడుతున్నా: యువ క్రికెటర్ రిషబ్ పంత్
భారత జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఏదో ఒకరోజు తనకు వస్తుందని తెలుసని యువ క్రికెటర్ రిషబ్ పంత్ (19) తెలిపాడు. 2016-17 రంజీ సీజన్ లో పరుగుల వరద పారించి, ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ వెస్టిండీస్ లో జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న సిరీస్ కు ఎంపికయ్యాడు. ధోనీ వారసుడిగా ప్రశంసలందుకుంటున్న రిషబ్ మాట్లాడుతూ, టీమిండియాకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని చెప్పాడు.
ఇంతకు ముందు తన లక్ష్యం జట్టులో స్థానం సంపాదించుకోవడమని, ఇప్పుడు తన లక్ష్యం నిలకడగా పరుగులు సాధించడమని చెప్పాడు. ఛాంపియన్స్ లీగ్ జట్టు స్టాండ్ బై జాబితాలో తనకు స్థానం ఉంచినప్పుడే ఏదో ఒకరోజు కచ్చితంగా జట్టుకు ఎంపికవుతానని అనిపించిందని చెప్పాడు. మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా జట్టుకు ఉపయోగపడాలని భావిస్తున్నానని రిషబ్ తెలిపాడు. కీపింగ్ కూడా చేస్తున్న 19 ఏళ్ల రిషబ్ కు సాహా, దినేష్ కార్తీక్ నుంచి గట్టి పోటీ ఉంది.