: కిరణ్‌బేడీకి కష్టకాలం.. ఆమెకు వ్యతిరేకంగా పుదుచ్చేరి అసెంబ్లీలో తీర్మానం.. తీవ్రస్థాయికి చేరుకున్న ప్రచ్ఛన్న యుద్ధం!
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీపై గుర్రుగా ఉన్న వి.నారాయణస్వామి ప్రభుత్వం ఆమెకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం పాసైంది. కిరణ్‌బేడీ విశేష అధికారాలను తగ్గించేందుకే ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఏఐఎన్ఆర్‌సీ ఈ తీర్మానాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతుండగా అడ్డుకున్నందుకు గాను ఏఐఎన్ఆర్‌సీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
కిరణ్‌బేడీ తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడం, రాజ్‌భవన్‌లో అధికారులతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండడం, సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపిస్తుండడంతో నారాయణస్వామి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గత కొంతకాలంగా గవర్నర్, నారాయణస్వామి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ విశేష అధికారాలను అణచివేయాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఇక నుంచి కిరణ్‌బేడీ ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోజాలరని, ఏదైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆ పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వ విషయాల్లో కిరణ్‌బేడీ అనవసరంగా తలదూరుస్తున్నారని అధికార కాంగ్రెస్ సభ్యుడు ఆర్‌కేఆర్ ఆనందరామన్ ఆరోపించారు. ‘‘అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. హిట్లర్ ప్రవర్తన కంటే బేడీ ప్రవర్తన దారుణంగా ఉంటోందని ఆయన ఆరోపించారు. కాగా, తనకు వ్యతిరేకంగా పాస్ చేసిన రిజల్యూషన్‌పై బేడీ ఇప్పటి వరకు స్పందించలేదు.