: వ్యవసాయం గౌరవప్రదం అంటూ కూరగాయలమ్మిన కేంద్ర మాజీ మంత్రి కుమార్తె ...సోషల్ మీడియాలో వైరల్
లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్, కేంద్ర మాజీ మంత్రి కరియా ముండా కుమార్తె చంద్రావతి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే పిల్లలు కూడా హోదాను ప్రదర్శించే ప్రస్తుత తరుణంలో జాతీయ స్థాయి నేత కుమార్తె అయిన చంద్రావతి ఎలాంటి హోదా ప్రదర్శించకుండా నడిరోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్మి వ్యవసాయం నామోషీ వ్యవహారం కాదని, వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అని చెబుతున్నారు.
జార్ఖాండ్ కు చెందిన రాజకీయ నాయకుడు కరియా ముండా నిరాడంబరుడైన రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఎలాంటి ఆడంబరాలకు, అవినీతికి పాల్పడని ఆయన తన పిల్లలకు కూడా ఆత్మగౌరవంతో బతకడం ఎలా అన్నదే నేర్పారు. దీంతో ప్రస్తుతం ఆయన కుమార్తె చంద్రావతి టీచర్ గా పని చేస్తున్నారు. వ్యవసాయం అంటే యువతకు చిన్నచూపు ఏర్పడిందని గుర్తించిన ఆమె తన స్కూలు పిల్లలతో కలిసి వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కూరగాయలు, పండ్లు అమ్ముతున్నారు. ఇలా అమ్మగా వచ్చిన డబ్బును అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఉపయోగిస్తానని చెబుతున్నారు. యువతరం గతాన్ని మర్చిపోతున్నారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, ఏ స్థాయికి వెళ్లినా గతాన్ని మర్చిపోకుండా ఉండడం ముఖ్యమని ఆమె చెబుతున్నారు.