: బాబ్బాబు, మీకు పుణ్యముంటుంది.. హోటళ్లు ఖాళీ చేయండి..: టూరిస్టులను కోరుతున్న హోటల్ యాజమాన్యాలు!
గూర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరుతో పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ అట్టుడుకుతోంది. గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) ఇచ్చిన పిలుపుతో డార్జిలింగ్‌లో బంద్ కొనసాగుతోంది. దీంతో అక్కడి హోటళ్లలో చిక్కుకుపోయిన పర్యాటకుల పరిస్థితి దయనీయంగా మారింది. బంద్ జరుగుతున్నా బుధవారం వరకు ధీమాగా ఉన్న హోటల్ యాజమాన్యాలు గురువారం నాడు ఒక్కసారిగా డీలా పడిపోయాయి. బంద్ నిరవధికంగా కొనసాగుతుందన్న జీజేఎం ప్రకటనతో నీరు గారిపోయాయి.
బంద్ ముగిసే వరకు హోటళ్లలో నిరభ్యంతరంగా ఉండవచ్చని గతంలో టూరిస్టులకు చెప్పిన హోటల్ యాజమాన్యాలు గురువారం ఒక్కసారిగా వారి గెడ్డం పట్టుకుని బతిమాలుకుంటున్నాయి. హోటళ్లలో ఆహార పదార్థాల నిల్వలు అయిపోయాయని దయచేసి ఖాళీ చేయాలంటూ వేడుకుంటున్నాయి. తమకేం చేయాలో అర్థం కాకే ఇలా పర్యాటకులను బతిమాలుకుంటున్నట్టు చెబుతున్నాయి. అవసరమైన సరుకులు కొనేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని, ఇప్పటికే సరుకులు నిండుకున్నాయని, బంద్ కొనసాగితే పరిస్థితి దారుణంగా తయారవుతుందని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. బంద్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదని, టూరిస్టులను ఖాళీ చేయించడం మినహా మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హోటల్ యాజమాన్యాల తీరుతో ఇప్పుడు పర్యాటకుల పరిస్థితి దయనీయంగా మారింది. హోటళ్లలో ఉండలేక, బయటకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు.