: నా కొడుకుది ఆత్మహత్య కాదు...హత్యే!: ఎస్సై ప్రభాకర్ రెడ్డి తల్లి
తన కుమారుడు ఎవరో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసు అధికారులు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని ఎస్సై ప్రభాకర్ రెడ్డి తల్లి పిన్నింటి వెంకటమ్మ అన్నారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారయత్నం చేశాడని, విచారణ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లా టంగుటూరులో ఆమె మాట్లాడుతూ, తన కుమారుడు అలాంటి వాడు కాదని స్పష్టం చేశారు. పోలీసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడిపై నిందలు వేస్తున్నారని ఆమె అన్నారు.
నెల రోజుల క్రితం తాను కుకునూర్ పల్లి వెళ్లినప్పుడు ‘‘ఇక్కడ ఒక ఎస్సై చనిపోయాడు మంచిగా ఉండు’’ అని చెబితే... "అమ్మా ఆత్మహత్య చేసుకుని ఆ ఎస్సై ఏం సాధించాడు?’’ అని ధైర్యం చెప్పాడని, అలాంటి వాడు ఆత్మహత్య ఎలా చేసుకుంటాడని ఆమె నిలదీశారు. తన కుమారుడు క్వార్టర్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడితే... ఆ విషయం తమకు చెప్పేందుకు పోలీసులకు నాలుగు గంటలు ఎందుకు పట్టిందని ఆమె ప్రశ్నించారు. తాము సంఘటనా స్థలికి చేరుకునే సరికే తన కుమారుడి బంగారు వస్తువులు కాజేశారని ఆమె అన్నారు. కొంతమంది లంచగొండి అధికారులే తమ కుమారుడ్ని చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.