: తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ కొత్తపార్టీ ప్రకటన?
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సినీనటుడు రజనీకాంత్ ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఆయన అభిమానులు భావిస్తున్న విషయం తెలిసిందే. రజనీ తన అభిమానులతో భేటీ అవుతుండడం కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో రజనీకాంత్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 12న కొత్తపార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆయన అభిమానుల డిమాండ్ 20 ఏళ్ల నుంచి ఉంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ అంశంపై రజనీకాంత్ పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇటీవల అభిమానులను కలిసిన తరువాత రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతారంటూ ఆయన సోదరుడు వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి పార్టీ పేరు, జెండా, ఎజెండాలపై రజనీ చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీ సేవలను కూడా రజనీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు పరిస్థితులపై, ఓటింగ్ సరళిని ఆ ఏజెన్సీ అధ్యయనం చేస్తోందని సమాచారం.