: అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు: సీఐడీ డీజీ ద్వారకా తిరుమలరావు
ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవని సీఐడీ డీజీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పైప్ కట్ అయిన ప్రాంతంలో నీళ్లు పోస్తే నేరుగా ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి వెళ్లాయని చెప్పారు. టెర్రస్ పైభాగంలో ఓ పైపు జాయింట్ ను తొలగించి మూడు మగ్గుల నీళ్లు పోస్తే చాలు వచ్చేస్తాయని.. వర్షపునీరు జగన్ ఛాంబర్ లోకి రావడానికి ఇదొక్కటే సోర్సు అని అన్నారు.
బిల్డింగ్ మొత్తం పరిశీలించాక ఎటువంటి నిర్మాణ లోపాలు లేవని చెప్పారు. ఈ రెండు విషయాలు ఇప్పటివరకు నిర్ధారణ అయ్యాయని..పైప్ పగిలిందా? కావాలని కోశారా? అనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఏపీలో కురిసిన వర్షాలకు అసెంబ్లీ భవనాల్లోకి వర్షపు నీరు చేరింది. అలాగే, ప్రతిపక్షనేత జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో, పలు విమర్శలు తలెత్తాయి.