: రాష్ట్రపతి స్థానానికి నాలుగోసారి పోటీ పడుతున్న చాయ్ వాలా!
ఒకప్పటి చాయ్ వాలా అయిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించి కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. ఈయన కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో ఏమో గానీ... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ చాయ్ వాలా రాష్ట్రపతి స్థానానికి వరుసగా నాలుగోసారి పోటీ పడుతున్నారు. ఆయన పేరే ఆనంద్ సింగ్ కుష్వారా. ఈ సారి కూడా ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గ్వాలియర్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల కుష్వారా 1994 నుంచి ఇలా పోటీ పడుతున్నారు. ఉప రాష్ట్రపతి కుర్చీ కోసం కూడా ఓ సారి పోటీ చేశారు.
‘‘గతంలో తగినన్ని ఓట్లను సంపాదించలేకపోయాను. ఈ సారి ఉత్తరప్రదేశ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నాను. నాకు మద్దతిచ్చే విషయంలో వారి నుంచి హామీ లభించింది’’ అని కుష్వారా వివరించారు. రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయడానికేముంది నామినేషన్ వేస్తే చాలుగా అనుకోవద్దు. కనీసం 50 మంది ఓటర్ల మద్దతివ్వాలి. అలాగే మరో 50 మంది సహకారం కూడా కావాలి. ఇప్పటి వరకు 20 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చరిత్ర కుష్వారా సొంతం.