: రోజా సోదరుల భూ కుంభకోణం అందరికీ తెలిసిందే.. భూ కుంభకోణాల చరిత్ర ఉన్న రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి: టీడీపీ నేత అనురాధ
వైసీపీ ఎమ్మెల్యే రోజా వైఖరి గురివింద గుంజను గుర్తుకు తెస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. భూ కుంభకోణాలపై నీతి వాక్యాలను రోజా పలుకుతుండటం హాస్యాస్పదమని అన్నారు. హైదరాబాదులో ఆమె సోదరులు చేసిన భూ కబ్జాల విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఈ వివాదంలో తన సోదరులను కాపాడుకోవడానికే ఆమె వైసీపీ పంచన చేరారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి మొనగాడు, దమ్మున్న మొగాడు అంటూ డబ్బా కొట్టుకునే రోజాకు... ఆయన హయాంలో నాదర్ గుల్, పుప్పాల గూడ, ఔటర్ రింగ్ రోడ్లలో జరిగిన భూ కుంభకోణాల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. భూ కుంభకోణాల చరిత్ర కలిగిన రోజా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
భూ కుంభకోణాలపై వేసిన సిట్ ను కోరల్లేని పాముగా రోజా అభివర్ణించడాన్ని అనురాధ తప్పుబట్టారు. గతంలో లిక్కర్ మాఫియాపై సిట్ వేస్తే... వైసీపీ నేత బొత్స సత్యనారాయణ లిక్కర్ మాఫియా మొత్తం బయటకు వచ్చిందని ఆమె చెప్పారు. సిట్ భయానికే ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి దేశం వదిలి పారిపోయారని అన్నారు. ఎర్ర చందనం స్మగ్లర్లకు చుక్కలు చూపించింది సిట్ కాదా? అని ప్రశ్నించారు. విశాఖ భూ కుంభకోణం విషయం వెలుగు చూసిన వెంటనే... 27 మంది తహసీల్దార్లు, 17 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశామని చెప్పారు.