: భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవీ రెడ్డి.. కర్నూలు జిల్లా టీడీపీలో మరో వివాదం!
కర్నూలు జిల్లా టీడీపీలో మంత్రి భూమా అఖిలప్రియ వివాదాస్పదంగా మారుతున్నారు. తాను టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి ప్రధాన కారణం అఖిలప్రియే అంటూ శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వివాదమే మరొకటి మొదలైంది. అఖిలప్రియతో ఆర్ఐసీ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కౌన్సిలర్లతో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మీరంతా అఖిల వైపు ఉంటారో లేక తన వైపు ఉంటారో తేల్చుకోవాలంటూ కౌన్సిలర్లకు ఆయన సూచించారు. నంద్యాలలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో తనను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇన్ ఛార్జ్ మంత్రులు సుజనా, కాల్వ శ్రీనివాసులు ఫోన్ చేశారు. వారి ఆదేశాల మేరకు ఆయన హుటాహుటిన విజయవాడ బయల్దేరారు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.