: 'బాహుబలి-2' ముందు వెలవెలబోయిన మెగాస్టార్లు, సూపర్ స్టార్లు... ఎన్ని సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందో తెలిస్తే షాక్ అవుతారు!
ఇప్పుడున్న పరిస్థితుల్లో మెగాస్టార్లు, సూపర్ స్టార్ల సినిమాలు కూడా 50 రోజులు ఎక్కడా ఆడటం లేదు. ఎక్కడైనా ఆడినా ఆ సెంటర్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ, 'బాహుబలి-2' ఈ విషయంలో కూడా సత్తా చాటింది. విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీతో నిరంతరం వార్తల్లో నిలిచిన ఈ చిత్రం... వేరే సినిమాలతో నాకు పోలికే లేదంటూ హాఫ్ సెంచరీ (50 రోజులు) కొట్టేసింది. అది కూడా మామూలుగా కాదు... దేశ వ్యాప్తంగా ఏకంగా 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
మరోవైపు 50 రోజులు గడిచిపోయినా, ఈ సినిమాకు ఇంకా ఆదరణ తగ్గలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 1650 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. త్వరలోనే ఈ సినిమాను చైనాలో విడుదల చేయనున్నారు.