: నేను మాంసాహారిని...నాపై గుడ్లు విసిరితే వాటితో ఆమ్లెట్ వేసుకుంటా: కేంద్ర మంత్రి
తాను మాంసాహారినని, తనపై ఎవరైనా గుడ్లు విసిరితే వాటితోనే ఆమ్లెట్ వేసుకుంటానని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పేర్కొన్నారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో మహానది నీటి సమస్యపై వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరమ్ తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని అక్కడికి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు జుయల్ ఓరమ్ వాహనంపై గుడ్లు విసిరారు.
దీనిపై బాబుల్ సుప్రియో మాట్లాడుతూ, ఇలాంటి చర్యలతో భయపెట్టాలని భావిస్తే, తనలో ఇసుమంతైనా భయం కలగదని అన్నారు. జుయల్ తో పాటు తనపై కూడా గుడ్లు విసిరే ప్రయత్నం జరిగిందని తెలిసిందని, తాను మాంసాహారినని, వారు విసిరిన గుడ్లతోనే ఆమ్లెట్ వేసుకుని తింటానని ఆయన చెప్పారు. తాను ఒడిశా కంటే ఎక్కువ రాజకీయ సమస్యలున్న పశ్చిమ్ బంగా నుంచి వచ్చానని, తనను ఎవరూ భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు.