: ఎయిర్ పోర్టులో ఎలాంటి విధ్వంసం సృష్టించలేదు: జేసీ దివాకర్ రెడ్డి వివరణ
విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో తాను ఎటువంటి విధ్వంసం సృష్టించలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎయిర్ పోర్టు సిబ్బంది పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని, సమయమున్నా బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని, ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎయిర్ పోర్టు సిబ్బంది తీరుతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేశానని, ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని జేసీ పేర్కొన్నారు.
కాగా, ఈ రోజు ఉదయం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు జేసీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయంకు వెళ్లిన ఆయన, తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వనందుకు ‘ఇండిగో’ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అయినప్పటికీ, సిబ్బంది అంగీకరించకపోవడంతో అక్కడి ఫర్నిచర్‌ను జేసీ ధ్వంసం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఆలస్యంగా రావడంతోనే ఆయనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని ‘ఇండిగో’ సిబ్బంది చెప్పారు. ఎయిర్ పోర్టులోని తమ ప్రింటర్ ను జేసీ తోసేయడంతో అది విరిగిపోయిందని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.